
న్యూఢిల్లీ: దేశ రాజధానిలో శుక్రవారం ఘోర అగ్ని ప్రమాదం జరిగింది. ఇందులో 27 మంది దుర్మరణం పాలయ్యారు. ముండ్కా మెట్రో స్టేషన్ సమీపంలోని మూడంతస్తుల భవంతిలో సాయంత్రం 4.40 సమయంలో మంటలు చెలరేగాయి. కనీసం 40 మందికి పైగా గాయపడ్డారని పోలీసులు తెలిపారు. దాదాపు 60 నుంచి 70 మందిని రక్షించామన్నారు. ఇంకా ఒక ఫ్లోర్‌ను గాలించాల్సి ఉండటంతో మృతుల సంఖ్య పెరగవచ్చని చెప్పారు. ఘటన గురించి తెలియగానే 24 మంది అగ్నిమాపక సిబ్బందిని పంపామని ఫైర్ డిపార్ట్మెంట్ అధికారులు తెలిపారు. ఈ భవనంలో పలు కంపెనీల కార్యాలయాలున్నాయి. తొలి అంతస్తులోని సీసీటీవీ కెమెరాల ఉత్పత్తి సంస్థలో మంటలు ఆరంభమై భవనమంతా పాకాయని డీసీపీ శర్మ చెప్పారు. ప్రమాదానికి కారణం తెలియాల్సి ఉందన్నారు. కంపెనీ అధిపతిని అదుపులోకి తీసుకున్నారు. ఘటనపై రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్, ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు, ప్రధాని నరేంద్ర మోదీ, ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ తదితరులు దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు రూ.2 లక్షలు, గాయపడ్డవారికి రూ.50 వేలు పరిహారం ప్రకటించారు.
Be the first to comment