ఏడేళ్లుగా రెగ్యులర్ VC లేడు – బాసర IIIT విద్యార్థుల ఆందోళన…

 

నిర్మల్ : రెగ్యులర్ వీసీ నియామకంతోపాటు.. 12 డిమాండ్ల సాధనే లక్ష్యంగా బాసర ట్రిపుల్ ఐటీ విద్యార్థులు ఆందోళన బాట పట్టిన సంగతి తెలిసిందే. వేలాది మంది విద్యార్థులు ఆందోళనకు దిగడాన్ని మీడియా ప్రముఖంగా కవర్ చేసింది. కానీ ప్రభుత్వం స్పందించాలనే ఉద్దేశంతో విద్యార్థులు వరుసగా రెండో రోజు సైతం ఆందోళనలకు దిగారు. దీంతో స్పందించిన మంత్రి KTR.. బాసర ఆర్జీయూకేటీ విద్యార్థుల సమస్యలను CM KCR, విద్యాశాఖ మంత్రి దృష్టికి తీసుకెళ్తానని హామీనిచ్చారు. విద్యార్థులు ఆందోళన చెందొద్దని కేటీఆర్ సూచించారు.

రంగంలోకి దిగిన నిర్మల్ జిల్లా కలెక్టర్.. బాసర ట్రిపుల్ ఐటీలో చర్చలు జరుపుతున్నప్పటికీ.. విద్యార్థులు మాత్రం వెనక్కి తగ్గకుండా నిరసన చేపడుతున్నారు. బాసర ట్రిపుల్ ఐటీ విద్యార్థుల ఆందోళన విషయమై ప్రతిపక్షాలు ప్రభుత్వంపై మండిపడుతున్నాయి. విద్యార్థులకు మద్దతుగా బాసర ట్రిపుల్ ఐటీ క్యాంపస్ వద్ద బీఎస్పీ నేతలు ధర్నాకు దిగగా.. పోలీసులు వారిని అరెస్ట్ చేసి స్టేషన్‌కు తరలించారు.

గత ఏడేళ్లుగా ప్రభుత్వం బాసర ట్రిపుల్ ఐటీకి వైస్ ఛాన్సలర్‌ను నియమించకపోవడంతోపాటు… 169 మంది రెగ్యులర్ ప్రొఫెసర్లు ఉండాల్సిన చోట కేవలం 15 మంది మాత్రమే రెగ్యులర్ ప్రొఫెసర్లు ఉన్నారని విపక్షాలు ఆరోపిస్తున్నాయి. బాసర ట్రిపుల్ ఐటీ విద్యార్థులు రోడ్డు మీదకు వచ్చే స్థాయికి వచ్చారంటే.. ఇన్నాళ్లపాటు సీఎం కేసీఆర్ స్పందించకపోవడమే కారణమని బండి సంజయ్ ఆరోపించారు. విద్యార్థుల సమస్యలను తెలుసుకోవడానికి మంత్రిని బాసర పంపాలని ఆయన డిమాండ్ చేశారు.

ట్రిపుల్ ఐటీ క్యాంపస్‌లోకి విద్యార్థుల తల్లిదండ్రులు సహా ఇతరులెవర్నీ అనుమతించడం లేదు. దీంతో తల్లిదండ్రులు క్యాంపస్ బయటే ఆందోళనకు దిగారు. ట్రిపుల్ ఐటీ వద్ద కాంగ్రెస్, బీజేపీ నేతలను పోలీసులు అరెస్ట్ చేశారు. వైఎస్ఆర్ హయాంలో ఏర్పాటైన బాసర ట్రిపుల్ ఐటీ క్యాంపస్ ను పట్టించుకోవడం లేదని వైఎస్సార్టీపీ నేతలు క్యాంపస్ వద్ద ఆందోళన చేపట్టగా వారిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*