రైల్వే ఉద్యోగి భార్య హత్య కేసులో కొత్త కోణం.. పాతకాలం నాటి ఫోన్ కోసమే దుండగుల ఘాతుకం!

 

  • పాత ఫోన్లు, టీవీలకు మంచి డిమాండ్ లక్షల్లో ముట్టజెబుతామంటూ తిరుగుతున్న ముఠాలు
    స్నేహితులే హంతకులు
  • కీలక పాత్ర పోషించిన రైల్వే ఉద్యోగికి సంకెళ్లు

విజయవాడకు చెందిన రైల్వే ఉద్యోగి సత్యనారాయణ భార్య సీత (50) హత్య కేసులో ఓ కొత్త విషయం వెలుగులోకి వచ్చింది. పాతకాలం నాటి ల్యాండ్‌ఫోన్ కోసమే హత్య జరిగినట్టు వెల్లడైంది. ఈ కేసులో రైల్వే ఉద్యోగుల సహా మరికొంతమంది పాత్ర ఉన్నట్టు పోలీసులు అనుమానిస్తున్నారు. పాతకాలం నాటి ల్యాండ్‌ఫోన్లు, టీవీలకు అంతర్జాతీయ మార్కెట్లో మంచి డిమాండ్ ఉండడంతో కొన్ని ముఠాలు వాటి సేకరణకు బయలుదేరాయి. అలాంటివి ఉంటే లక్షల్లో డబ్బులు ఇస్తామని ఆశపెడుతున్నాయి.

సత్యనారాయణ వద్ద పాతఫోన్ ఉన్నట్టు ఆయన స్నేహితులకు తెలిసింది. దీంతో దానిని సొంతం చేసుకోవాలని వారు పథకం వేశారు. ఆయన ఇంట్లో లేని సమయంలో ఇంటికి వెళ్లి ఫోన్ కోసం ఆయన భార్య సీతతో గొడవపడ్డారు. ఈ క్రమంలో జరిగిన పెనుగులాటలో ఆమెను హత్య చేశారు. ఫోన్‌తోపాటు ఆమె మెడలోని నగలు, డబ్బు కూడా తీసుకుని పరారయ్యారు.

హత్య జరిగిన వెంటనే రంగంలోకి దిగిన పోలీసులు తొలుత ఎలాంటి ఆధారాలను కనిపెట్టలేకపోయారు. ఆ ప్రాంతంలో సీసీ కెమెరాలు కూడా లేకపోవడంతో నిందితుల జాడ కనిపెట్టడం సవాలుగా మారింది. దీంతో కాల్‌డేటా ఆధారంగా నిందితులను అదుపులోకి తీసుకున్నారు. ఈ వ్యవహారంలో కీలక పాత్ర పోషించిన రైల్వే ఉద్యోగికి కూడా సంకెళ్లు వేశారు. వారిని విచారించగా పాతకాలం నాటి ఫోన్‌ కోసమే హత్య చేసినట్టు నిందితులు అంగీకరించినట్టు తెలుస్తోంది. కేసు దర్యాప్తు కొనసాగుతున్నట్టు పోలీసులు తెలిపారు.

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*