800 కోట్ల బకాయిలు… TSRTC MD కి లీగల్ నోటీసులు

 

తెలంగాణ ఆర్టీసీ(TSRTC)కి క్రెడిట్ కో ఆపరేటివ్ సొసైటీ(credit operative society) షాకిచ్చింది. తమకు బాకీపడిన మొత్తాన్ని వెంటనే చెల్లించాలంటూ ఆర్టీసీ ఎండీ సజ్జనార్‌(Sajjanar)కు లీగర్ నోటీస్ ఇచ్చింది. మొత్తం రూ.800 కోట్లు రావాల్సి ఉన్నా తక్షణమే రూ.500 కోట్ల చెల్లించాలని కోరింది. ఈ నిధులు వస్తేనే సిబ్బందికి రుణాలతో పాటు పదవీ విరమణ పొందిన ఉద్యోగులకు పొదుపు నిధులు ఇచ్చే వీలుంటుందని పేర్కొంది. 15 రోజుల్లోగా డబ్బు చెల్లించాలని, లేదంటే కోర్టును ఆశ్రయిస్తామని సీసీఎస్ లీగర్ నోటీసుల్లో పేర్కొన్నట్లు తెలుస్తోంది.

ఉద్యోగులకు తక్కువ వడ్డీకే లోన్లు ఇవ్వడం, రిటైరైన వాళ్లకు సెటిల్మెంట్లు చేయడంతో పాటు సిబ్బందికి సంక్షేమ పథకాలు అమలు బాధ్యతను క్రెడిట్ కో ఆపరేటివ్ సొసైటీ చూసుకుంటుంది. ఆర్టీసీలో 48వేల మందికి పైగా ఉద్యోగులున్నారు. వీరి జీతాల నుంచి రికవరీ అయ్యే వడ్డీ, పొదుపు, లోన్ రిఫండ్ డబ్బులు నెలనెలా కట్ అవుతుంటాయి. ఆ మొత్తాన్ని అదే నెలలో 15 రోజుల్లోపు సొసైటీకి సంస్థ ఇవ్వాలి. ఉద్యోగులంతా నెలనెల సభ్యత్య రుసుము, లోన్ రికవరీ పేరిట నెలకు రూ.25కోట్ల వరకు చెల్లిస్తున్నారు. అయితే ఈ నిధులను సొసైటీకి పంపించకుండా ఆర్టీసీ యాజమాన్యమే వాడుకుంటోంది. ఆ మొత్తం సుమారు రూ.800 కోట్లు దాటిపోయింది. దీంతో సీసీఎస్ నిధులు లేక జనవరి నుంచి కార్మికులు దరఖాస్తు చేసుకున్న రుణాలను సైతం పెండింగ్‌లో పెట్టేసింది.

సీసీఎస్ డబ్బులు కోరుతున్న సిబ్బందికి ఆరు నెలల గడువు ఉంటుంది. కోఆపరేటివ్ చట్టం ప్రకారం ఈ ఆరు నెలల్లో వారిని కన్విన్స్ చేయలేకపోతే 181వ రోజు ఎవరి డబ్బులు వారికి తిరిగిచ్చేయాలి. అయితే సీసీఎస్ దగ్గర నగదు నిల్వలు లేకపోవడంతో ఆర్టీసీ చెల్లించాల్సిన డబ్బులపైనే ఆశలు పెట్టుకుంది. గత ఎండీ హయాంలోనూ ఇలాగే లీగల్ నోటీసులు పంపితే కొన్ని నిధులు వచ్చాయని, ఇప్పుడు కూడా తమ వద్ద నిధులు లేకపోవడంతో ఆర్టీసీ ఎండీకి లీగల్ నోటీసులు పంపాల్సి వచ్చిందని అధికారులు చెబుతున్నారు.

సీసీఎస్ నుంచి లోన్లు తీసుకున్నవారు 10 వేల మంది, సభ్యత్వం రద్దు చేసుకున్నవారు 6 వేల మంది, రిటైరైన ఉద్యోగులు ఇంకో వెయ్యి మంది వరకు ఉన్నారు. ఒక్కో ఉద్యోగికి రూ.6 లక్షల నుంచి 7 లక్షలు రావాల్సి ఉంది. రిటైర్ అయిన సిబ్బందికి మే నుంచి పొదుపు డబ్బులు ఇవ్వాల్సి ఉన్నా చెల్లించలేని పరిస్థితి నెలకొంది. గత జూన్ లోనే 385 మంది రిటైర్ కాగా అందులో ఫిక్స్ డ్ డిపాజిట్లు చేసుకున్న వారికి వడ్డీ ఇవ్వాలి. వీటన్నింటి రూపేణా సుమారు రూ.500 కోట్ల వరకు సీసీఎస్ చెల్లించాల్సి ఉంది.

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*