
- చిన్నారులకు వైద్యంలో ఏపీ భేష్
- పేదల దేవుడు జగనన్న
- చిన్నపిల్లల గుండె చికిత్స కోసం వెయ్యి కోట్లతో ఆస్పత్రులు
- కేజీహెచ్‌లో చిన్న పిల్లల వార్డు ఆకస్మిక తనిఖీ
విశాఖపట్నం : నిరుపేద చిన్నారులకు ఉచితంగా నాణ్యమైన వైద్యాన్ని అందించడంలో దేశంలోనే ఏపీ ముందు ఉందని రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ మంత్రి, విశాఖపట్టణం జిల్లా ఇన్చార్జి మంత్రి విడదల రజిని తెలిపారు. విశాఖలోని అతిపెద్ద ప్రభుత్వ ఆస్పత్రి కేజీహెచ్‌లోని చిన్న పిల్లల విభాగాన్ని మంత్రి విడదల రజిని శనివారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ చిన్నపిల్లల గుండె చికిత్స కోసం దాదాపు వెయ్యి కోట్ల రూపాయలతో విశాఖపట్టణం, విజయవాడ, తిరుపతి నగరాల్లో కొత్తగా చిన్నపిల్లల హృదయాలయాలను అందుబాటులోకి తీసుకొస్తున్నామని చెప్పారు. తిరుపతిలో ఇప్పటికే వైద్య సేవలు మొదలయ్యాయని వివరించారు. వేలాది చిన్నారుల ప్రాణాలను కాపాడగలుగుతున్నామని తెలిపారు. చిన్నపిల్లల్లో వచ్చే దాదాపు అన్ని రుగ్మతలకు ఆరోగ్యశ్రీ ద్వారా చికిత్స అందిస్తున్న ఏకైక ప్రభుత్వం ఈ దేశంలోనే తమ ప్రభుత్వమే అని చెప్పారు. సీతమ్మపేట, పార్వతిపురం, రంపచోడవరం, బుట్టాయగూడెం, దోర్నాల లాంటి గిరజన ప్రాంతాల్లో సైతం ట్రైబల్ మల్టీ స్పెషాలిటీ ఆస్పత్రులను నిర్మిస్తున్న గొప్ప ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి అని తెలిపారు.
వైద్య సేవలు ఎలా ఉన్నాయి…
కేజీహెచ్‌లోని చిన్న పిల్లల విభాగంలో రోగులకు అందుతున్న వైద్య సేవలపై మంత్రి విడదల రజిని ఆరా తీశారు. చిన్నారులతో పాటు వార్డులో ఉన్న వారి తల్లిదండ్రులను అక్కడ వైద్యం అందుతున్న తీరును అడిగి తెలుసుకున్నారు. ఆస్పత్రిలో అందుతున్న వైద్య సేవలపై వారంతా సంతృప్తి వ్యక్తంచేశారు. ఈ సందర్భంగా రోగుల బంధువులు అక్కడి షెడ్డులో ఇబ్బందులు పడుతుండటాన్ని మంత్రి గుర్తించారు. రోగుల బంధువులు ఆస్పత్రిలో రాత్రిళ్లు సౌకర్యవంతంగా ఉండేందుకు వీలుగా దోమ తెరలు ఏర్పాటుచేయాలని ఆదేశించారు. వారికి 24 గంటలూ మంచినీరు అందుబాటులో ఉండేలా చూడాలని చెప్పారు. రోగులతోపాటు, వారి బంధువులకు కూడా ఆస్పత్రి లో ఎలాంటి అసౌకర్యం కలగడానికి వీల్లేదని తెలిపారు. కార్యక్రమంలో స్థానిక ఎమ్మెల్యే వాసుపల్లి గణేష్, మేయర్ గొలగాని వెంకటరమణకుమారి, కలెక్టర్ మల్లికార్జునరావు తదితరులు పాల్గొన్నారు.
Be the first to comment