హైదరాబాద్‌లో సమావేశమైన ఇద్దరు నేతలు… వంగవీటి, కేశినేని …?

 

విజయవాడ: విజయవాడ రాజకీయాల్లో ఆసక్తికర పరిణామం కనిపించింది. విజయవాడ ఎంపీ కేశినేని నాని (Kesineni Nani) సోదరుడు, టీడీపీ (TDP) నేత కేశినేని చిన్ని (Kesineni Chinni) మాజీ ఎమ్మెల్యే వంగవీటి రాధాకృష్ణ (Vangaveeti Radha Krishna)తో హైదరాబాద్‌లో భేటీ అయ్యారు. వంగవీటితో చిన్ని సమావేశం కావడం ఆసక్తికరంగా మారింది. ఈ ఇద్దరు నేతలు టీడీపీలో ప్రస్తుత పరిస్థితులు, తాజా పరిణామాలపై చర్చించినట్లు తెలుస్తోంది.

టీమ్ కేశినేని శివనాథ్ పేరుతో ఈ ఫోటోలను ట్వీట్ చేశారు. ‘హైదరాబాద్‌లో వంగవీటి రాధాతో భేటీ అయిన టీడీపీ నేత కేశినేని చిన్ని. విజయవాడ పార్లమెంటు పరిధిలో విస్తృత సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్న కేశినేని చిన్ని.. తాను నిర్వహిస్తున్న సేవా కార్యక్రమాలను రాధాకు వివరించిన చిన్ని కేశినేని చిన్ని సేవా కార్యక్రమాలను అభినందించిన వంగవీటి రాధ. సేవా కార్యక్రమాలకు తన మద్దతు ఉంటుందని వంగవీటి రాధ తెలిపారు ’అన్నారు.

కొద్దిరోజులుగా కేశినేని బ్రదర్స్ మధ్య విభేదాలు నడుస్తున్న సంగతి తెలిసిందే. విజయవాడ ఎంపీ కేశినేని నాని తన సోదరుడిపై ఫిర్యాదు చేశారు. తాను ఎంపీగా ఉపయోగించే వీఐపీ వాహన స్టిక్కర్ లాంటిదే నకిలీది తయారు చేసుకుని విజయవాడ, హైదరాబాద్‌లో తిరుగుతున్నారని ఆరోపించారు. వాహనం నంబర్ టీఎస్07హెచ్‌డబ్ల్యూ 777 అని, ఆ వ్యక్తిపై చర్యలు తీసుకోవాలని ఫిర్యాదులో ప్రస్తావించారు. తన పేరు, హోదాను ఉపయోగించి బెదిరింపులకు పాల్పడుతున్నారని ఆరోపించారు.

ఈ కారు నాని సోదరుడు కేశినేని శివనాథ్ అలియాస్ చిన్ని వినియోగిస్తున్నారు. అయితే తెలంగాణ పోలీసులు తనిఖీలు చేసి తిరిగి కారును వదిలేశారట. సొంత తమ్ముడిపై ఎంపీ నాని ఫిర్యాదు చేయడం విజయవాడ రాజకీయాల్లో హాట్‌టాపిక్ అయ్యింది. కేశినేని కుటుంబంలో వార్ మొదలైంది. ఈ వివాదంపై కేశినేని చిన్ని క్లారిటీ ఇచ్చారు. టీడీపీలో తాను సాధారణ కార్యకర్తను మాత్రమే అంటున్నారు. అయితే ఇప్పుడు వంగవీటి రాధా, కేశినేని చిన్ని భేటీ రాజకీయంగా ప్రాధాన్యత సంతరించుకుంది.

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*