జూనియర్ NTRతో BJP సీనియర్ నేత, హోం మంత్రి అమిత్ షా భేటీ…

 

సినీ నటుడు జూనియర్ ఎన్టీఆర్‌‌తో బీజేపీ సీనియర్ నేత, హోం మంత్రి అమిత్ షా భేటీ అయ్యారు.

హైదరాబాద్‌: అత్యంత ప్రతిభావంతుడైన తెలుగు సినిమా తారకరత్నాన్ని కలిశానంటూ తారక్‌తో భేటీ అనంతరం అమిత్ షా ట్వీట్ చేశారు.

 

మునుగోడు సభలో పాల్గొనడం కోసం తెలంగాణ వచ్చిన అమిత్ షా. ఈ సందర్భంగా జూనియర్ ఎన్టీఆర్‌తో 20 నిమిషాలపాటు ఏకాంతంగా భేటీ కావడం.. ఆ తర్వాత కలిసి విందు చేయడం రాజకీయంగా ప్రాధాన్యం సంతరించుకుంది. వాస్తవానికి గతంలో టీడీపీ తరఫున ప్రచారం చేసిన ఎన్టీఆర్.. ఆ తర్వాత రాజకీయాలకు దూరంగా ఉంటున్నారు. సినిమాలకు మాత్రమే ఆయన పరిమితమయ్యారు.

ఇటీవల రిలీజైన ట్రిపుల్ ఆర్ సినిమాలో కొమురం భీమ్ పాత్రలో తారక్ అద్భుత నటన కనబర్చారు. ఆయన యాక్టింగ్ నచ్చడంతో.. అమిత్ షా కలిసి అభినందించారు. కానీ ఇది కేవలం అభినందించడం కోసం మాత్రమే కాదని.. అంతకు మించి ఏదైనా వ్యూహం ఉండొచ్చనే భావన వ్యక్తం అవుతోంది.

టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు తారక్‌ను వాడుకొని పక్కనబెట్టారనే భావన ఆయన అభిమానుల్లో ఉంది. జూనియర్ ఎన్టీఆర్ చేతికి పార్టీ పగ్గాలు అప్పగిస్తేనే.. టీడీపీకి పునర్వైభవం సాధ్యమని ఇప్పటికీ చాలా మంది కార్యకర్తలు భావిస్తున్నారు. మంచి వాగ్ధాటి ఉన్న ఎన్టీఆర్.. తన తాత ఎన్టీఆర్‌లాగే జనాలను ఆకర్షించగలరని గతంలోనే రాజకీయ పరిశీలకులు అంచనాకొచ్చారు. ఈ నేపథ్యంలో తారక్‌తో అమిత్ షా భేటీ రాజకీయంగా ప్రాధాన్యం సంతరించుకుంది.

అదీగాక ఏపీలో బీజేపీ, జనసేన మధ్య పొత్తు ఉంది. అలాంటప్పుడు పవన్ కళ్యాణ్‌ను కలవకుండా.. జూనియర్ ఎన్టీఆర్‌ను కలవాలని అమిత్ షా భావించడం అనేక అనుమానాలకు తావిస్తోంది. బీజేపీ, జనసేన మధ్య పొత్తు ఉన్నప్పటికీ.. ఎవరికి వారే అన్నట్టుగా పరిస్థితి ఉంది. ప్రధాని మోదీ భీమవరం సభకు పవన్ కళ్యాణ్ హాజరు కాలేదు. రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ వీడ్కోలు కార్యక్రమానికి జనసేనానికి ఆహ్వానం పంపినప్పటికీ.. ఆరోగ్య కారణాల రీత్యా రాలేకపోతున్నానని పవన్ గతంలో తెలిపారు. ఈ పరిణామాలన్నింటినీ గమనిస్తుంటే.. బీజేపీ, జనసేన విడిపోతాయేమోననే అభిప్రాయాన్ని రాజకీయ విశ్లేషకులు వ్యక్తం చేస్తున్నారు. పవన్ కళ్యాణ్‌ను CM అభ్యర్థిగా ప్రకటించాలని గతంలో జనసేన డిమాండ్ చేయగా.. బీజేపీ నుంచి ఆశించిన రీతిలో స్పందన రాకపోవడమే దీనికి నిదర్శనమనే అభిప్రాయమూ వ్యక్తమవుతోంది. జనసేన, బీజేపీ మధ్య పొత్తు ఉన్నప్పటికీ.. కమలం పార్టీతో వైఎస్సార్సీపీ సన్నిహితంగా మెలుగుతోంది. కానీ రాజకీయ అవసరాల దృష్ట్యా బీజేపీ సైతం జగన్‌కు ప్రాధాన్యం ఇస్తోంది.

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*