ఎన్నికల విధులకు వాలంటీర్ల వినియోగం.. SEC కీలక ఆదేశాలు

 

గ్రామ, వార్డు వాలంటీర్లకు ఎన్నికల విధులపై రాష్ట్ర ఎన్నికల కమిషన్ శుక్రవారం కీలక ఆదేశాలు వెలువరించింది. ఎట్టి పరిస్థితుల్లోనూ వాలంటీర్లను ఎన్నికల విధులకు వినియోగించరాదని ఏపీ ఎన్నిక‌ల క‌మిష‌న‌ర్ ముఖేశ్ కుమార్ మీనా స్పష్టం చేశారు. ఆయా జిల్లాల క‌లెక్ట‌ర్లు, ఎన్నిక‌ల రిట‌ర్నింగ్ అధికారుల‌తో స‌మావేశం సంద‌ర్భంగా మీనా ఈ ఆదేశాలు జారీ చేశారు. గ్రామ‌, వార్డు వాలంటీర్లు ఎన్నిక‌ల విధుల్లో పాల్గొన‌కుండా చ‌ర్య‌లు తీసుకోవాలని ఈ సంద‌ర్భంగా మీనా అధికారుల‌కు సూచించారు. ఓట‌ర్ కార్డుతో ఆధార్ అనుసంధాన ప్రక్రియ‌లో వారిని భాగ‌స్వాముల‌ను చేయొద్దని పేర్కొన్నారు.

వాలంటీర్ల‌కు ఎన్నిక‌ల సంబంధించిన ఏ ప‌నుల‌ను అప్ప‌గించ‌వ‌ద్దని ఆదేశించారు. ప్ర‌భుత్వ వేత‌నం తీసుకుంటున్నందున వారిని భాగ‌స్వాముల‌ను చేయొద్దని కూడా ఎస్ఈసీ మీనా ఉద్ఘాటించారు. కాగా, గతంలోనూ పలు సందర్భాల్లో వాలంటీర్లను ఎన్నికల విధులకు దూరంగా ఉంచాలని ఎస్ఈసీ కూడా ఆదేశించిన విషయం తెలిసిందే.

వైఎస్సార్సీపీ కార్యకర్తలే వాలంటీర్లుగా ఉన్నారని, ఆ పార్టీ నేతలు, మంత్రులే స్వయంగా ఈ విషయాన్ని అనేక సందర్భాల్లో వెల్లడించారని పేర్కొంటూ ఎన్నికల సంఘానికి ఫిర్యాదులు వెల్లువెత్తడంతో ఎన్నికల సంఘం ఈ ఆదేశాలిచ్చింది. ఫలితంగా ఓటర్ల నమోదు, తొలగింపు, చేర్పులు, మార్పులు, ఓటర్ల జాబితా ప్రచురణ, పోలింగ్‌ కేంద్రాల ఎంపిక, ఎన్నికల రోజున ఓటరు చీటీల పంపిణీ, పోలింగ్‌ ఏర్పాట్లు, పోలింగ్‌ విధులు, ఓట్ల లెక్కింపు వంటి ఎన్నికలకు సంబంధించిన విధుల్లో వాలంటీర్లు ఎట్టి పరిస్థితుల్లోనూ పాల్గొనకూడదు.

క్షేత్రస్థాయిలో రిటర్నింగ్‌, సహాయ రిటర్నింగ్‌ అధికారులు వాలంటీర్లకు ఎన్నికలకు సంబంధించి ఎలాంటి విధులూ అప్పగించరాదు. అలా చేస్తే అది నిబంధనలకు విరుద్ధమవుతుంది. 2019లో వైఎస్ జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చిన తర్వాత ఆంధ్రప్రదేశ్‌లో వాలంటీర్ వ్యవస్థను ప్రారంభించిన విషయం తెలిసిందే.

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*