Ntr Health University పేరు మార్పు బిల్లుకు అసెంబ్ల ఆమోదం…

 

ఏపీ అసెంబ్లీ లో డాక్టర్‌ ఎన్టీఆర్‌ హెల్త్‌ యూనివర్సిటీ పేరును మార్పు చేస్తూ ప్రభుత్వం తీసుకొచ్చిన బిల్లుకు ఆమోదం లభించింది.

ఏపీ అసెంబ్లీ: యూనివర్సిటీకి వైఎస్సార్‌ పేరు పెడుతూ డాక్టర్‌ ఎన్టీఆర్‌ ఆరోగ్య విశ్వవిద్యాలయం సవరణ (2022) బిల్లును వైద్యారోగ్యశాఖ మంత్రి విడదల రజిని సభలో ప్రవేశపెట్టారు. అనంతరం దీనిపై చర్చించి ఆమోదం తెలిపారు. ఈ బిల్లు శాసనసభ ఆమోదం పొందినట్లు స్పీకర్‌ తమ్మినేని సీతారామ్‌ ప్రకటించారు.

ఎన్టీఆర్ అంటే తనకు ఎలాంటి కోపం లేదు అన్నారు ముఖ్యమంత్రి వైఎస్ జగన్. ఎన్టీఆర్‌ మీద తనకు ఆప్యాయతే ఉందని.. ఆయన్ని అగౌరవ పరిచే కార్యక్రమూ తన తరపున ఏనాడూ జరగదు అన్నారు. ఏ రోజు ఎన్టీఆర్‌ను ఒక్క మాట అనలేదని.. పైగా పాదయాత్రలో ఇచ్చిన హామీ కింద ఎన్టీఆర్‌ జిల్లాగా పేరు పెట్టిన విషయాన్ని గుర్తు చేశారు. టీడీపీ హయాంలో ఏదైనా కట్టి ఉంటే.. దానికి ఎన్టీఆర్‌ పేరు పెట్టమని వాళ్లు అడిగితే సానుకూలంగా స్పందిస్తామన్నారు.

దివంగత మహానేత వైఎస్ రాజశేఖర్ రెడ్డి పేదల కష్టాలు తెలిసిన వ్యక్తి అన్నారు జగన్. ఖరీదైన వైద్యాన్ని పేదలకు అందించారని.. ప్రాణం విలువ తెలిసిన డాక్టర్‌ అన్నారు. వైద్య రంగంలో సంస్కరణలకర్త అని.. పేదవాడి సమస్యలు, జీవితాలు అర్థం చేసుకున్న వ్యక్తి అంటూ ప్రశంసించారు. దేశవ్యాప్తంగా గుర్తింపు పొందిన ఆరోగ్యశ్రీ పథకంతో పాటు ప్రజావైద్యం కోసం 108, 104 సర్వీసులు తెచ్చిన ఘనత ఆయనకే దక్కుతుందన్నారు. దేశం మొత్తం ఆయన గురించి గొప్పగా మాట్లాడుకుందన్నారు.

ఏపీలో 11 మెడికల్‌ కాలేజీలకు ఎనిమిది టీడీపీ ఆవిర్భావం కంటే ముందే ఉన్నాయి అన్నారు. టీడీపీ చరిత్రలో ఒక్క మెడికల్‌ కాలేజీ పెట్టలేదని.. మూడు మెడికల్‌ కాలేజీలు వైఎస్సార్‌ హయాంలోనే వచ్చాయి అన్నారు. ఇప్పుడు కొత్తగా 17 మెడికల్‌ కాలేజీలు నిర్మాణంలో ఉన్నాయని.. మొత్తం 28 మెడికల్‌ కాలేజీల్లో 20 కాలేజీలు వైఎస్సార్‌, తన హయాంలోనే వచ్చాయి అన్నారు. అలాంటప్పుడు వైఎస్సార్‌ పేరు పెట్టకూడదనడం న్యాయమేనా అంటూ ప్రశ్నించారు. అర్హత దక్కాల్సిన వాళ్లకు క్రెడిట్‌ ఇవ్వకపోవడం ధర్మమేనా అన్నారు.

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*