కాశీలో శివాలయాన్ని నిర్మించిన నూర్ ఫాతిమా… భక్తుల కోసం పెద్ద హాలు…

 

దేశంలో మతసామరస్యానికి నిజమైన ప్రతీకగా నిలిచే ఘటన కాశీలో చోటుచేసుకుంది. ఓ ముస్లిం మహిళ.. శివాలయాన్ని నిర్మించారు. లాయర్‌గా పనిచేస్తున్న నూర్ ఫాతిమా నిజానికి 2004 లోనే ఆలయాన్ని నిర్మించారు. అయితే గుడి మరీ చిన్నగా ఉండడంతో భక్తులు మందిరంలో కూర్చుని… పూజలు, ప్రార్థనలు చేసుకునేందుకు ఇబ్బందులు పడేవారు. అందుకే నూర్ ఫాతిమా ఆ ఆలయానికి ఎదురుగా మరో పెద్ద హాలును నిర్మించారు.

వారణాసిలోని రుద్ర బీహార్ కాలనీలో ఉండే నూర్‌ఫాతిమా… ఆలయ నిర్మాణమే కాకుండా.. కొత్తగా హాలును కూడా నిర్మించి చాలామందికి ఆదర్శంగా నిలిచారు. ఆమె చేసిన పనితో మతాలు, అభిప్రాయాలు, సామాజిక వర్గాలు వేరైనా.. ఒకరి పట్ల మరొకరు గౌరవంతో ఉండాలనే మంచి విషయాన్ని చాటిచెప్పారు. అయితే ఈ ఆలయం ఫాతిమా నిర్మించడానికి ప్రత్యేక కారణం కూడా ఉందంట. నూర్ ఫాతిమాకు కలలో దేవుడు కనిపించి.. ఆలయాన్ని నిర్మించాలని సూచించారట. అందుకే ఆమె ఖర్చుకు ఏ మాత్రం వెనుకాడకుండా.. వేరే మతానికి సంబంధించినది అని కూడా భావించకుండా మంచి మనస్సుతో మందిరాన్ని నిర్మించారని స్థానికులు చెబుతున్నారు.

ముస్లిం మహిళ అయిన నూర్ ఫాతిమా.. గుడిలో శివుడిని దర్శించుకున్న తర్వాత ఎక్కడికి వెళ్లినా.. తన పనికి ఆటంకం లేకుండా జరుగుతుందని అన్నారు. అంటే శివుడి పట్ల భక్తి ఉందనే విషయం స్పష్టం చేశారు. 2004లో నిర్మితమైన ఈ ఆలయానికి కాలనీ చుట్టుపక్కల ప్రజలు కూడా వచ్చి నిత్యం పూజలు చేస్తున్నారు. అందులో భజన కార్యక్రమాలను నిర్వహిస్తుంటారు. ఈ క్రమంలో నూర్ ఫాతిమా.. ఒక పెద్ద హాలును నిర్మించగా.. దానిని మంత్రి రవీంద్రనాథ్‌ జైస్వాల్ ప్రారంభించారు.

 

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*