
చైనాలో కరోనా కేసులు భారీగా నమోదవుతున్నాయి. ప్రాణనష్టం కూడా ఎక్కువగానే ఉంటోందని ప్రచారం జరుగుతోంది. కాగా చైనా ప్రభుత్వం జీరో కోవిడ్ పాలసీని ఎత్తేశాక ఆ దేశంలో ప్రతి రోజూ దాదాపు 9 వేల మంది జనం చనిపోతున్నారని యూకేకి చెందిన హెల్త్ డేటా సంస్థ అంచనా వేసింది. డిసెంబర్ నెలలో కనీసం 18.6 మిలియన్ల కోవిడ్ కేసులు నమోదు కాగా.. లక్షకు పైగా మరణాలు సంభవించి ఉంటాయని ఆ సంస్థ అంచనా వేసింది. జనవరి మధ్య నాటికి రోజుకు 3.7 మిలియన్ కోవిడ్ కేసులు నమోదవుతాయని.. జనవరి 23 నాటికి చైనాలో 5.84 లక్షల మరణాలు నమోదవుతాయని అంచనా.
చైనా ప్రభుత్వం వెల్లడిస్తోన్న వివరాలకు.. యూకే సంస్థ గణాంకాలకు ఏమాత్రం పొంతన ఉండటం లేదు. న్యూక్లిక్ యాసిడ్ టెస్టులో కరోనా పాజిటివ్‌గా తేలి, రెస్పిరేటరీ ఫెయిల్యూర్ (శ్వాసవ్యవస్థ విఫలం)తో చనిపోయిన వారిని మాత్రమే కరోనా మరణాల జాబితాలో చైనా చేరుస్తోంది. ఇతర దేశాలు మాత్రం కరోనా సోకిన 28 రోజుల్లో మరణించిన వారందర్నీ కోవిడ్ మృతుల జాబితాలో చేరుస్తున్నాయి. డిసెంబర్ 30న ఒక్కరు మాత్రమే కోవిడ్‌తో చనిపోయారని చైనా ధ్రువీకరించింది.
కోవిడ్ డేటాపై తీవ్ర విమర్శలు వస్తోన్న నేపథ్యంలో… చైనా అధికారులు తమ దేశంలో కరోనా పరిస్థితిపై చర్చించేందుకు ప్రపంచ ఆరోగ్య సంస్థ అధికారులతో సమావేశమయ్యారు. జెనెటిక్ సీక్వెన్సింగ్‌తోపాటు ఎంత మంది హాస్పిటల్‌లో చేరుతున్నారు, వ్యాక్సినేషన్‌కు సంబంధించిన వివరాలపై మరింత సమాచారం అందించాలని ఈ ఆన్‌లైన్ భేటీలో చైనా అధికారులను డబ్ల్యూహెచ్‌వో కోరింది.
చైనా నుంచి వస్తోన్న వారి విషయంలో ప్రపంచ దేశాలు ఆంక్షలు విధిస్తోన్న నేపథ్యంలో.. కోవిడ్ విషయంలో తాము పాదర్శకంగా, శాస్త్రీయంగా వ్యవహరిస్తున్నామని డ్రాగన్ ప్రకటించింది. చైనా నుంచి వచ్చే ప్రయాణికులు కోవిడ్ నెగటివ్ రిపోర్ట్ చూపించాలని ప్రపంచ దేశాలు నిబంధనలు విధిస్తున్నాయి. తాజాగా ఈ జాబితాలో కెనడా, మొరాకో చేరాయి.
Be the first to comment