
- నందమూరి తారకరత్నకు బెంగళూరు నారాయణ హృదయాలయలో మెరుగైన ట్రీట్మెంట్ అందిస్తున్నారు డాక్టర్లు.
- గతంతో పోలిస్తే ఆయన ఆరోగ్యం కాస్త నిలకడగానే ఉందని.. కొంత మార్పు కనిపించింది అంటున్నారు.
తారకరత్నకు సోమవారం మరిన్ని పరీక్షలు నిర్వహించబోతున్నారు.. ఆ పరీక్షల్లో వచ్చే ఫలితాలను బేరీజు వేసుకొని ఎలాంటి చికిత్స అందించాలనేది నిర్ణయిస్తారు. చికిత్సకు తారకరత్న శరీరం స్పందిస్తున్నట్లు చెబుతున్నారు.. ఇవాళ చేసే పరీక్షలు చాలా కీలకం అంటున్నారు. అలాగే హెల్త్ బులిటెన్ విడుదల చేసే అవకాశం ఉంది.
తారకరత్న చికిత్సకు స్పందిస్తున్నారని నందమూరి బాలకృష్ణ ఆదివారం తెలిపారు. ఆయన త్వరగా కోలుకోవాలని అభిమానులు ప్రార్థించాలని.. ఆరోగ్య పరిస్థితి గతంలో కంటే మెరుగ్గా ఉంది అన్నారు. వెంటిలేటర్‌పై చికిత్స అందిస్తున్నారని.. రెండుసార్లు తారకరత్న శరీరంపై గిచ్చితే.. ఓసారి స్పందించారని వివరించారు. అంతేకాదు కళ్లలోనూ కదలికలు ఉన్నట్లు తెలిపారు. ఆందోళనకర పరిస్థితి నుంచి కోలుకోకపోయినా.. తారకరత్న ఆరోగ్యంలో మార్పులు కనిపించాయి అంటున్నారు.
నందమూరి తారకరత్న శుక్రవారం ప్రారంభమైన నారా లోకేష్ యువగళం పాదయాత్రలో పాల్గొన్నారు. ఓ మసీదులో ప్రార్థనల తర్వాత బయటకు వచ్చి తిరిగి పాదయాత్ర ప్రారంభించారు. ఆ సమయంలో తారకరత్న ఒక్కసారిగా సొమ్మసిల్లి పడిపోయారు. టీడీపీ కార్యకర్తలు వెంటనే దగ్గరలో ఉన్న కేసీ ఆస్పత్రికి తరలించారు. అయితే అక్కడ ప్రాథమిక చికిత్స అందించి మెరుగైన వైద్యం కోసం పీఈసీ ఆస్పత్రికి తరలించారు. వెంటనే నందమూరి బాలయ్య అక్కడికి చేరుకుని డాక్టర్లతో మాట్లాడారు.
శనివారం రాత్రి కుప్పం ఆస్పత్రి డాక్టర్ల సలహా మేరకు తారకరత్నను ప్రత్యేక అంబులెన్సులో బెంగళూరు హృదయాలయకు తరలించారు. అక్కడ డాక్టర్ల టీమ్ పర్యవేక్షణలో వైద్యం కొనసాగుతోంది. ముందు ఎక్మోపై వైద్యం అందించారని ప్రచారం జరిగింది.. అయితే వెంటిలేటర్‌పై ట్రీట్మెంట్ అందిస్తున్నట్లు క్లారిటీ వచ్చింది. శనివారం తారకరత్న ఆరోగ్యంపై హెల్త్ బులిటెన్ విడుదల చేశారు. ఆదివారం కొంతమేర ఆరోగ్యం నిలకడగా ఉందని తెలిపారు.
Be the first to comment