పల్నాడులో పులుల కలకలం అప్రమత్తం చేసిన ఫారెస్ట్ అధికారులు

 

పల్నాడు జిల్లా , నరసరావుపేట :

పల్నాడు జిల్లాలోని నల్లమల రిజర్వ్‌ ఫారెస్టుకు సమీపంలోని కొన్ని ప్రాంతాల ప్రజలకు పెద్ద పులుల సంచారం కంటిమీద కునుకులేకుండా చేస్తున్నాయి.
ఇటీవల దుర్గి మండలం కాకిరాల, అడిగొప్పుల అటవీ ప్రాంతంలో ఓ ఆవుపై పులులు దాడి చేసి చంపినట్లు అధికారులు నిర్ధారించారు. దీంతో దుర్గి, కారంపూడి, బొల్లాపల్లి మండలంలో టెన్షన్‌ నెలకొంది. మాచర్ల, వినుకొండ నియోజకవర్గాల్లోని శివారు పల్లెల్లో ప్రస్తుతం ఎక్కడ చూసినా పులి గురించే చర్చిస్తున్నారు. నల్లమల సమీప ప్రాంతాల్లో బెబ్బులి సంచారం అలజడి సృష్టిస్తోంది. పల్నాడులోని లోయపల్లి, గజాపురంతోపాటు వెల్దుర్తి, దుర్గి, కారంపూడి, బొల్లాపల్లి మండలాల్లోని అటవీ ప్రాంతాల్లో వ్యాఘ్రాలు ఆహారం, నీటి కోసం పొలాలు, వాగుల వెంబడి బయట సంచరిస్తున్నాయి. పశువులు, జీవాలు వీటి బారినపడి అసువులు బాస్తున్నాయి. ప్రస్తుతం పులుల సంచారంపై స్థానికుల్లో ఆందోళన వ్యక్తమవుతుంది. పల్నాడులోని విజయపురిసౌత్‌ ప్రాంతంలో తరచూ పులుల సంచారం ఉంటోంది. ప్రస్తుతం నాగార్జునసాగర్‌-శ్రీశైలం టైగర్‌ రిజర్వ్‌ ఫారెస్ట్లో 75 వరకు పులులు ఉన్నట్లు అటవీ అధికారులు చెబుతున్నారు. ప్రస్తుతం వాటి సంచారం పల్నాడు జిల్లా వైపునకు వస్తున్నట్లు అంచనా వేశారు. గత నెల 26న దుర్గి మండలం గజాపురం సమీపంలో ఆవుపై పులి దాడి చేసి చంపేసింది. పాదముద్రలను బట్టి పులేనని అటవీ అధికారులు నిర్ధారణ చేశారు. వెల్దుర్తి మండలం లోయపల్లి ప్రాంతంలో జీవాలు, పశువులపై పలుమార్లు దాడి చేసినట్లు- కాపర్లు, అధికారులు చెబుతున్నారు.

అడవి సమీపంలో అప్రమత్తం :

పల్నాడు అటవీశాఖ పరిధిలో 44 వరకు బీట్లు ఉన్నాయి. ఇటీవల పులుల సంచారం పెరగడంతో ఆయా ప్రాంతాల్లోని ప్రజలు అప్రమత్తమయ్యారు. అటవీ అధికారులు స్థానికులకు అవగాహన కల్పిస్తున్నారు. పులి నుంచి రక్షణ పొందేందుకు రైతుల పొలాల వద్ద విద్యుత్‌ తీగలు ఏర్పాటు చేయొద్దని హెచ్చరికలు సైతం జారీ చేశారు. ఈ ప్రాంతంలో ప్రజలు ప్రధానంగా వ్యవసాయం, పశుపోషణపైనే ఆధారపడి జీవిస్తుంటారు. పశువుల మేత కోసం అడవిలోకి వెళ్లినప్పుడు వ్యాఘ్రం దాడి చేస్తుందని వణికిపోతున్నారు. ఏం జరుగుతుందోనని జిల్లాకు శివారునున్న పల్లె వాసులు బిక్కుబిక్కుమంటున్నారు. పులులు తమ పరిధిని 25 నుంచి 50 కిలోమీటర్లు విస్తరించుకుంటాయి. అందులోకి ఇతర జంతువులు విహరిస్తే అవి సహించవు. ముఖ్యంగా సంతానోత్పత్తి కోసం వాటి పరిధి నుంచి బయటకు వస్తాయి. ఆహారం, నీటి కోసం గ్రామాల వైపు వస్తాయి. ఇలా వచ్చిన పులులు కొన్ని రోజులు విహరించి, తిరిగి మాతృ స్థానానికి చేరుకుంటాయి. ఆ సమయాల్లో సమీప గ్రామాల ప్రజలు అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఉంది.

గ్రామాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలి :

అటవీ ప్రాంతానికి సమీపంలోని గ్రామాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని డీఎఫ్‌వో రామచంద్రారావు తెలిపారు. దుర్గి మండల పరిధిలోని కాకిరాల, గజాపురం గ్రామాల్లో డీఎఫ్‌వో పర్యటించి గ్రామస్థులను అప్రమత్తం చేశారు. నష్టం జరగకుండా ఉండేందుకు అన్ని చర్యలను తీసుకున్నట్లు చెప్పారు. పులుల జాడ కోసం ప్రత్యేక నిఘా కూడా ఏర్పాటు- చేశామన్నారు. పులుల సంచారం నిర్ధారణ అయిందని, వీటి కోసం ప్రత్యేకంగా సీసీ ట్రాప్స్‌ ఏర్పాటు చేశామని చెప్పారు. కాపరుల అడవికి దూరంగా ఉండాలని సూచించారు. ప్రజలు రాత్రి సమయంలో ఒంటరిగా సంచరించవద్దని ప్రజలను కోరారు.

నరసరావుపేట
(పల్నాడు జిల్లా)
కరస్పాండెంట్: షేక్.గౌస్ మస్తాన్ వలి

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*